Today all political parties are talking about women empowerment. But the respective political parties are not giving proper priority to women.
మహిళా రిజర్వేషన్‌తోనే సాధికారత సాధ్యం
నేడు మహిళా సాధికారత గూర్చి అన్ని రాజకీయ పక్షాలు మాట్లాడు తున్నాయి. కానీ మహిళలకు ఆయా రాజకీయ పక్షాలు సముచితమైన ప్రాధాన్యతను ఇవ్వటం లేదు.
నేటికి మహిళలను వంట ఇంటికే పరిమితం చేస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతాపార్టీ నేటికీ మనుస్మృతిని ప్రామాణికంగా భావిస్తున్నది.
స్త్రీల హక్కుల పట్ల చులకనభావం చూపిస్తున్నది. మన రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని ప్రచారం చేస్తున్నది. కానీ మనుస్మృతి మహిళలను అంటరానివారిగా భావించి వారికి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు వాంఛనీయం కాదని చెబుతున్నది.
ఆధునిక ప్రపంచంలోనూ మహిళలు అన్ని రంగాలలో వివక్షతకు గురవుతున్నారు. అన్ని దేశాలలో ఈ వివక్షత కొనసాగుతున్నది. భూమి, ఆకాశం, సముద్రగర్భంలో అన్ని రంగాలలో నేడు పురుషులో సమానంగా మహిళలు పనిచేస్తున్నారు.
పోటీ పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధిచెందిన దేశం నుండి దేశ అధ్యక్ష పదవికి ఒక భారతీయ మూలం ఉన్న మహిళ పోటీపడటం మనకు గర్వకారణం.
విద్య, వైద్య, సాఫ్ట్‌వేర్ రంగాలలో మహిళలు ఎంతో ముందంజలో ఉన్నారు. రక్షణరంగం, విమానయాన రంగం, అంతరిక్షరంగం, షిప్పింగ్ వంటి రంగాల లోను తమ ప్రతిభను చాటుకుంటున్నారు. పోలీస్ శాఖ, రైళ్ల, రవాణారంగంలో ముందడుగు వేశారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నతాధి కారులుగా ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి వాటిలో పురుషులను అధిగమించి ముందుకు వెళుతున్నారు.
అన్ని రంగాలలో మహిళలు సాంప్ర దాయత సంకెళ్లను ఛేదించుకుని ముందుకు వెళ్ల గలిగినా రాజకీయంగా ఇంకా వడివడిగా అడుగులువేసే దశలోనే ఉన్నారు.
ఇందిరాగాంధీ, ప్రతిభా పాటిల్, ద్రౌపది ముర్ము, సోనియా గాంధీ వంటివారు అత్యున్నతస్థాయిలోకి వెళ్లినప్పటికీ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు సరైన ప్రాతినిధ్యం 75ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా లభ్యంకాక పోవటం విచారకరం.
భారతదేశం రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యంలో 103వ స్థానంలో ఉంది. అసియాఖండంలో 13స్థానం, సార్క్ దేశాలలో 5వ స్థానంలో, బ్రిక్స్ దేశంలో 4వ స్థానంలో మనం ఉన్నాము.
అల్జీరియా, దక్షిణసూడాన్, లిబియా వంటి దేశాలు మనకంటే మెరుగైన స్థానిల్లో ఉన్నారు. నేపాల్, అఫ్గానిస్తాన్, ఫిలిప్పైన్స్, సింగపూర్, వియత్నాం, చైనా, పాకిస్థాన్, కంబోడియా, బంగ్లాదేశ్ వంటి దేశాలు మహిళా ప్రాతినిధ్యంలో మనకంటే ముందున్నాయి.
ప్రపంచంలో అభివృద్ధి చెందిన పెట్టుబడీదారీ దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, జపాన్‌వంటి దేశాలు కూడా మహిళలకు రాజకీయ రంగంలో సముచితమైన ప్రాతినిధ్యాన్ని కల్పించలేక పోయాయి.
ప్రపంచంలో రువాండా 56.3 శాతం మహిళా ప్రాతినిధ్యంతో అగ్రస్థానంలో ఉంది. స్వీడన్ 46.4శాతం, దక్షిణాఫ్రికా 44.5శాతం, ఐస్‌ల్యాండ్ 42.9శాతం, నెదర్లాండ్స్ 42శాతం, ఫిన్లాండ్ 40శాతం, నార్వే 30.6శాతం, మెజాంబిక్ 39.2శాతం, అంగోలా 38.6శాతం ప్రాతినిధ్యాన్ని మహిళలకు కల్పించి అగ్రస్థాయిలో ఉన్నారు.
మన పక్కన ఉన్న నేపాల్ 32.8శాతం, పాకిస్తాన్ 22శాతం, బంగ్లాదేశ్ 14శాతం ప్రాతినిధ్యం ఉంది. ఇరాన్ 2.8శాతంతో కనిష్టస్థాయిలో ఉంటే, మొత్తం అరబ్ ప్రపంచం 9శాతం మాత్రమే ప్రాతినిధ్యం కలిగిఉంది.
ఐరాస 1995లో 30శాతం ప్రాతినిధ్యం మహిళలకు ఉండాలని చెప్పినా నేటికీ ఆచరణలోకి రాలేదంటే రాజకీయ రంగంలో పురుషాధిక్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 1960 దశకంలో శ్రీలంక ప్రధానమంత్రిగా సిరిమావో బండారు నాయకే ఎన్నికైనారు.
ఈవిడ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఇక రెండవ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ 1966లో ఎన్నికైనారు. తరువాత స్థానంలో గోల్డామీర్(ఇజ్రాయిల్), ఇసాబెల్ పెరాన్(అర్జంటైనా), ఎలిజబెత్ డొమిటియన్ (సెంట్రల్ ఆఫ్రికా), మార్గరెట్ థాచర్(ఇంగ్లాండ్), మరియా డా లేర్డ్వన్ పింటాసిల్లో (పోర్చుగల్) లు ఉన్నారు.
అంగ్‌సాన్ సూకీ(మైన్మార్), బీటా స్టిడ్(పోలెండ్), గో హర్లెమ్ బ్రంట్ట్ (నార్వే), బార్బరా డ్రమ్మర్(ఆస్ట్రియా) బేనజీర్ భుట్టో(పాకిస్థాన్), ఏంజెలా మర్కెల్(జర్మనీ)థెరిసా మే(ఇంగ్లాండ్), జూలియా గిల్లార్డ్ (బోస్నియా), మెర్బ్ గోలినాలు ఆయా దేశాలకు పాలకులుగా పనిచేశారు.
ఇంకా అనేక దేశాలలో మహిళలు తమ దేశాలకు అధ్యక్షులుగా, ప్రధానులుగా ఉన్నతస్థానాలలో ఉన్నారు. అయినా ప్రపంచంలో మహిళల వివక్షత కొనసాగుతూనే ఉంది. దేశం ఏదైనా మహిళల పరిస్థితి అన్నిచోట్ల ఒకేలా ఉంది. మహిళలు అడుగడుగునా వివక్షతకు గురవుతున్నారు.
వేధింపులకు, అపహరణకలు, అత్యాచారాలకు గురవుతున్నారు. మహిళలు పురుషులతో సమంగా పరోగమించాలంటే ప్రపంచ వ్యాపితంగా చట్టసభలలో నేడున్న 22శాతం ప్రాతినిధ్యాన్ని ఐరాస చెప్పినవిధంగా 30శాతంకుపైగా సాధించుకోవాలి.
ఇక భారతదేశానికి వస్తే మొదటి లోక్‌సభలో మహిళలకు 5శాతం ప్రాతినిధ్యంఉంటే 70ఏళ్లతరువాత 17వ లోక్‌సభలో 15శాతం మహిళలు ఉన్నారు. 1992లో పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నకాలంలో 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలలో మూడవ వంతు మహిళలకు రిజర్వు చేశారు.
తరువాత మహాం ాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాలలో 50శాతం రిజర్వేషన్ కల్పించారు. పార్లమెంటు, శాసనసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ఉద్దేశించి 1996 సెప్టెంబరు 12న 81వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చింది.
అప్పుడు సీనియర్ పార్లమెంటేరియన్ సీపీఐ మహిళా నాయకురాలు గీతా ముఖర్జీ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ పరిశీలనకు బిల్లు పంపారు. కమిటీ కొన్ని సిఫారసులతో బిల్లును ఆమోదించినప్పటికీ 1996, 1998, 1999లలో లోక్‌సభ రద్దుతో బిల్లులు కూడా రద్దు అయ్యాయి.
చిట్టచివరకు 27ఏళ్ల తరువాత దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గత సంవత్సరం సెప్టెంబరులో పార్లమెంటు నూతన భవనంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా బిల్లును ఆమోదించారు. కానీ 2024 ఎన్నికలలో అమలు జరపకుండా 2029 ఎన్నికలనుండి అమలు చేస్తామని చెబుతున్నారు.
దేశ జనాభా జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు తగిన సమయం ఉన్నా దానిని వినియోగించకుండా ప్రభుత్వం అనవసర జాప్యానికి పాల్పడిరది. ఇది బీజేపీ ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనం ఆశించి చేసిందే.
చిత్తశుద్ధి లోపించిం దని పలు మహిళా సంఘాలు విమర్శించాయి. ఈ బిల్లుకు 454 మంది అనుకూలంగా, కేవలం ఇద్దరు మాత్రమే వ్యతిరేకంగా ఓటు చేశారు.
అయినా అమలు విషయంలో మీనమేషాలు లెక్కించటం అసమంజసం అవుతుంది. రిజర్వేషన్ అంశాన్ని కాగితాలకే పరిమితం చేయటం తగదు.
2024 సార్వత్రిక ఎన్నికల క్రమంలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని పెద్దఎత్తున ఆందోళన జరిగినా ప్రభుత్వం స్పందించలేదు. దేశ స్వాతంత్య్రో ద్యమం తరువాత మహిళలు చురుకుగా రాజకీయ కార్యకలాపాలలో, దేశ పునర్నిర్మా ణంలో ప్రముఖ పాత్ర వహించారు.
విద్య, విజ్ఞానం పెరిగింది. పురుషులతో సమానంగా అన్నిరంగాలలో పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లు తక్షణం అమలు చేస్తే అన్ని రంగాలలో మహిళా సాధికారత సాధించటం సులభం అవుతుంది.
అనేకమంది మహిళా నేతలు సమాజం ముందుకు వస్తారు. స్థానిక రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు సాధారణ గ్రామీణ మహిళలుసైతం ఎంతో పురోగతిని సాధిస్తున్న విషయం మనం చూస్తున్నాం. శాసనవ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుం టాయి. రిజర్వేషన్ల వల్ల మహిళల్లో అక్షరాస్యత, ఉన్నత చదువులు పెరుగు తాయి.
సామాజిక ఉద్యమ ఆసక్తి పెరిగి మూఢవిశ్వా సాలు తగ్గుతాయి. మహిళలపై నేరాలు సైతం తగ్గుతాయి. మహిళల పరిపాలన, నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల వల్ల మహిళల మధ్య పోటీ జరుగుతుంది.
కాబట్టి లింగ వివక్షత కూడా తగ్గుతుంది. సామాజిక సమస్యలను మానవతాకోణంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది. పితృస్వామ్య, ఫ్యూడల్ సంబంధాలు తగ్గి మహిళలు స్వేచ్చా, స్వాతంత్య్రాలను అనుభవించగలుగుతారు. స్వతంత్ర భారతంలో గత 75 ఏళ్లుగా మహిళల రక్షణకు ఎన్నో చట్టాలువచ్చాయి.
ఆత్మరక్షణ, లైంగిక దాడులు నుండి రక్షణ, సౌకర్యాలు, వ్యభిచారం వృత్తి నుండి విముక్తి, వరకట్నం వేధింపులు, కిడ్నాప్‌లు మోసం వంటి వాటినుండి రక్షణకు ఎన్నో చట్టాలు వచ్చాయి. మరెన్నో చట్టాలు చేయవలసి ఉంది.
ఈ క్రమం సజావుగా సాగాలంటే తక్షణం మహిళా రిజర్వేషన్‌లను చట్టసభలలో అమలుచేయాలి. రిజర్వేషన్ అమలు చేయించటం ద్వారా మాత్రమే మహిళలు సాధికారత సాధించగలుగుతారు.
ఆ దిశగా మహిళలు, మహిళా సంఘాలు పురోగమిం చాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి8) సందర్భంగా ఆశిద్దాం. పాలకులంతా మీరు ఇప్పుడైనా మేల్కొంటారా? చీకటి తెరలను చీలుస్తారా? ప్రభాత విపంచిక పలికిస్తారా? అంటూ తిలక్ ఇచ్చిన పిలుపును గుర్తు తెచ్చుకుందాం!
Comments
Post a Comment